2 Corinthians 6
కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థ్ధము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.
"అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణదినము."
"మాపరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక,"
"శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులమందును,"
"దెబ్బలయందును, చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను, మిగుల ఓర్పుగలవారమై"
"పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను"
"సత్య వాక్యము చెప్పుట వలనను దేవుని బలమువలనను, కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,"
"ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను, దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము."
మేము మోసగాండ్ర మైనట్లుండియు సత్యవంతులము. తెలియబడని వారమనట్లుండియు బాగుగా తెలియబడిన వారము;
"చనిపోవుచున్న వారమైనట్లుండియు, ఇదిగో బ్రతుకు చున్నవారము. శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము. దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము. దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము."
"ఓ కొరింథీయులారా, అరమర లేకుండ మీతో మాటలాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడియున్నది."
మీ యెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు. కాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది.
మీ యెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?
మనము జీవము గల దేవుని ఆలయమై యున్నాము. అందువలన దేవుడులాగు సెలవిచ్చుచున్నాడు-
"నేను వారిలో నివసించి సంచరించెదను; నేను వారి దేవుడనై యుందును. వారు నా ప్రజలై యుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినైయుందును. మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు."